మృతదేహంతో కరోనా వ్యాప్తి జరగదు: అమెరికా అంటువ్యాధుల నిపుణుడు విజయ్

  • ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి
  • మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకోవద్దు
  • మృతదేహాలను కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటున్నారు
  • కరోనా మరణించిన వారి మృతదేహాలపై ప్రజల తీరు సరికాదు
కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా పలుచోట్ల ప్రజలు అడ్డుకుంటోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కరోనాతో మరణించిన వారి మృతదేహాలకు తమ ప్రాంతంలో అంత్యక్రియలు చేస్తే తమకూ కరోనా సోకుతుందున్న అపోహలు ప్రజల్లో పెరిగిపోతున్నాయి. అయితే, మృతదేహాలతో కరోనా వ్యాపించదని, ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని షికాగోలోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయ అంటువ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి చెప్పారు.

కరోనా బారినపడి ఎవరైనా ప్రాణాలుకోల్పోతే వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించకుండా అపోహల కారణంగా అడ్డుకోవడం సరికాదని విజయ్‌ ఎల్దండి  చెప్పారు. మృతదేహాల వల్ల కరోనా సోకుతుందన్న భయాందోళనలు వద్దని చెప్పారు. కరోనా సోకి మృతి చెందిన వారి మృతదేహాలను కొన్ని గ్రామాల్లో అడ్డుకుంటున్న విషయాన్ని తాను మీడియా ద్వారా తెలుసుకుంటున్నట్లు తెలిపారు.

కరోనా మరణించిన వారి మృతదేహాలపై ప్రజల తీరు సరికాదని ఆయన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు ఓ లేఖ అందజేశారు. కాగా, ఇదే విషయంపై వినోద్ కుమార్ స్పందిస్తూ.. మృతదేహాలను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంత్యక్రియలను నిర్వహించనివ్వకుండా ప్రజలు అడ్డుకోవద్దని కోరారు.


More Telugu News