హీరో సుశాంత్ మృతి కేసు విచారణ విషయంలో కీలక పరిణామం.. సీబీఐకి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం సిఫారసు

  • ముంబై పోలీసులు బీహార్‌ పోలీసులకు సహకరించట్లేదని విమర్శలు
  • నిన్న బీహార్‌ అసెంబ్లీలో సీబీఐ విచారణకు ఎమ్మెల్యేల డిమాండ్
  • ముంబై పోలీసులపై సీఎం నితీశ్ కూడా అసంతృప్తి
  • సుశాంత్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బీహార్, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు విచారణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం ( సీబీఐ)కి అప్పగించాలని బీహార్‌ ప్రభుత్వం సిఫారసు చేసింది.

కాగా, దర్యాప్తులో భాగంగా గత ఆదివారం రాత్రి ముంబైకి వెళ్లిన బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విన‌య్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేయడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో నిన్న బీహార్‌ అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఈ కేసులో సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేశారు.

ముంబై పోలీసులు, బీఎంసీ అధికారుల తీరుపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసులో ముంబై పోలీసులు బీహార్‌ పోలీసుల విచారణకు సహకరించట్లేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు సుశాంత్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీహార్ ప్రభుత్వం సీబీఐ విచారణకు సిఫారసు చేసింది.


More Telugu News