ఇటీవల మరణించిన మాజీ మంత్రి మాణిక్యాలరావు కుటుంబసభ్యులకు లేఖ రాసిన ప్రధాని మోదీ

  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోదీ
  • అందరికీ అందుబాటులో ఉండేవారని వెల్లడి
  • మాణిక్యాలరావు మరణం తీరని లోటు అంటూ వ్యాఖ్యలు
బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇటీవలే కరోనాతో కన్నుమూసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు అర్ధాంగి సూర్యకుమారికి రాసిన ఓ లేఖలో ప్రధాని సంతాపం తెలియజేశారు. మాణిక్యాలరావు ఇక లేరన్న వార్త తెలిసి ఎంతో విషాదానికి లోనయ్యానని మోదీ పేర్కొన్నారు. మాణిక్యాలరావు ధైర్యవంతుడైన, చురుకైన నేత అని, ఏపీలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి చేసేందుకు అంకితభావంతో కృషి చేశాడని కొనియాడారు.

తన నిరాడంబర జీవనవిధానం ద్వారా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేవారని కీర్తించారు. పేదల జీవితాల్లో మంచి మార్పు కోసం ఎంతగానో శ్రమించారని, ఇప్పుడాయన మరణం ఓ తీరని లోటుగా మారిందని మోదీ విచారం వెలిబుచ్చారు. ఎదుటివాళ్లకు అభయం ఇస్తున్నట్టుండే ఆయన రూపం ఏపీ ప్రజలకు చిరకాలం గుర్తుంటుందని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు.


More Telugu News