మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి సీఎం కేసీఆర్, కేటీఆర్ సంతాపం

  • రాజకీయనాయకులను బలిదీసుకుంటున్న కరోనా
  • నిమ్స్ లో చికిత్స పొందుతూ నంది ఎల్లయ్య కన్నుమూత
  • విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనా మహమ్మారికి బలవడం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశవ్యాప్తంగా అనేకమంది రాజకీయ ప్రముఖులు కరోనాతో మృతి చెందుతుండడం తెలిసిందే. ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన నంది ఎల్లయ్య హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

నంది ఎల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి తీవ్ర విచారకరం అంటూ కేసీఆర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. మంత్రి కేటీఆర్ కూడా నంది ఎల్లయ్య మృతికి విచారం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో తన స్పందన వెలిబుచ్చారు.

కౌన్సిలర్ స్థాయి నుంచి నేటి వరకు నాతో కలిసి పనిచేశాడు: వీహెచ్

నంది ఎల్లయ్య కరోనాతో మరణించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణం ఎంతో బాధాకరం అని వ్యాఖ్యానించారు. కౌన్సిలర్ గా ప్రస్థానం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు తనతో కలిసి పనిచేశాడని వీహెచ్ పేర్కొన్నారు. నంది ఎల్లయ్య ఎంతో నిజాయతీపరుడు అని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు.


More Telugu News