రియలెస్టేట్ కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారు: చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ ధ్వజం

  • మూడు రాజధానులతో చంద్రబాబుకు వచ్చిన కష్టమేమిటి
  • అమరావతిలో భూమి రేట్ల కోసం చంద్రబాబు ఆలోచిస్తున్నారు
  • బౌద్ధ క్షేత్రాలను నాశనం చేస్తున్నారంటూ వార్తలు రాయిస్తున్నారు
వైజాగ్ లో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని నిర్మిస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చిన కష్టమేమిటని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడుతుంటే... చంద్రబాబు మాత్రం అమరావతిలో భూమి రేట్ల కోసం ఆలోచిస్తున్నారని ఆరోపించారు. 14 నెలల్లో రూ. 60 వేల కోట్లను సంక్షేమం కోసం ఖర్చు చేసిన ఏకైక సీఎం జగన్ అని కితాబిచ్చారు. రియలెస్టేట్ వ్యాపారం కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో నడుస్తున్నది కెమెరా ఉద్యమమని ఎద్దేవా చేశారు.

మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకముందే విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోలను విడుదల చేసిందని అమర్నాథ్ తెలిపారు. బౌద్ధ క్షేత్రాలను నాశనం చేస్తున్నారంటూ తప్పుడు వార్తలను రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కోసం కమ్యూనిస్టు పార్టీలు వారి భావజాలాన్ని మార్చుకుంటున్నాయని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పేరును చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మార్చుకోవాలని... దానికి సీపీఐ రామకృష్ణ అధ్యక్షుడిగా వ్యవహరించాలని అన్నారు.


More Telugu News