సరిహద్దుల్లో మరోసారి అలజడి రేపిన చైనా... భారీ నిర్మాణ సామగ్రితో ముందుకొచ్చిన సైనికులు

  • పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత
  • ఈ నెల 29 రాత్రి జరిగిన ఘటన
  • భారత సైన్యం అప్రమత్తతతో వ్యవహరించిన వైనం
సరిహద్దుల్లో కొన్నాళ్లగా ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా మళ్లీ అదే బాటలో పయనిస్తోంది. ఇటీవలే గాల్వన్ లోయ వద్ద ఘర్షణల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగినా, చైనా వైఖరిలో మార్పురాలేదు. తాజాగా, సరిహద్దుల్లో చైనా మరోసారి కయ్యానికి కాలు దువ్విందని భారత సైన్యాధికారులు వెల్లడించారు. ఈ నెల 29న చైనా సైనికులు అలజడి సృష్టించారని వివరించారు.

150 నుంచి 200 మంది వరకు ఉన్న చైనా సైనికులు సరిహద్దు వెంబడి పాంగాంగ్ సరస్సు వద్ద దుందుడుకు చర్యలకు పాల్పడ్డారని, భారీగా నిర్మాణ సామగ్రితో ముందుకొచ్చారని తెలిపారు. తద్వారా చైనా సైనికులు యథాతథ స్థితిని ఉల్లంఘించినట్టయిందని అన్నారు. కాగా, చైనా సైనికుల కదలికలపై మన సైన్యానికి ముందే సమాచారం అందిందని, చైనా సైనికులు మరింత ముందంజ వేయకండా అప్రమత్తతతో వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దినట్టు భారత సైన్యం ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ వెల్లడించారు.


More Telugu News