అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు అగ్రనేత గణపతి.. లొంగిపోయేందుకు రంగం సిద్ధం!

  • ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, డయాబెటిస్‌తో బాధపడుతున్న గణపతి
  • ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యమం వైపు
  • గణపతి తలపై కోటి రూపాయల నజరానా
మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు (74) లొంగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి సమస్యలతో గత రెండేళ్లుగా బాధపడుతున్న గణపతిని ప్రస్తుతం మోసుకుని తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి లొంగిపోయి చికిత్స పొందడమే మేలని భావిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గణపతి లొంగుబాటుకు తెలంగాణ పోలీసు అధికారులు చొరవ తీసుకుంటున్నారని, మోదీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సుముఖంగా ఉన్నట్టు చెబుతున్నారు.  

జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌కు చెందిన గణపతి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టారు. అయితే, ఆ తర్వాత నక్సలైటు ఉద్యమంపై ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరారు. 1977లో తొలిసారి ఆయనపై కేసు నమోదైంది. 1990-91లో పీపుల్స్‌వార్‌లో చీలికలు రావడంతో 2005లో ఏర్పడిన మావోయిస్టు పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంపాటు ఆ పదవిలో కొనసాగిన గణపతి తలకు ప్రభుత్వం కోటి రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న గణపతి స్థానంలో నంబాల కేశవరావును పార్టీ నియమించింది. గణపతికి భార్య విజయ, కుమారుడు వాసుదేవరావు ఉన్నారు.


More Telugu News