తరిమి కొట్టినా వినని చైనా... ఉదయం చర్చలకు హాజరై, సాయంత్రానికి దుందుడుకుతనం!

  • మరోసారి ముందుకు దూసుకు వచ్చిన చైనా
  • సైన్యాన్ని నియంత్రించుకోవాలని భారత్ హెచ్చరిక
  • ఇండియానే ఒప్పందాలను ఉల్లంఘిస్తోందన్న చైనా
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే తొలగేలా లేవు. లడఖ్ సమీపంలోని దక్షిణ ప్రాంతంలో గత నెలాఖరున ముందుకు దూసుకొచ్చిన చైనా సైనికులు, రెండు రోజుల తరువాత మరోసారి అదే పని చేశారని సైన్యాధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చైనా దుందుడుకుతనాన్ని ముందుగానే ఊహిస్తున్న భారత జవాన్లు, వారిని వెంటనే అడ్డుకుని వెనక్కు తరిమేశారు. ఈ విషయాన్ని వెల్లడించిన విదేశాంగ శాఖ వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చాలని చైనా భావిస్తోందని ఆరోపించింది.

గత నెల 31న చైనా దళాలు కవ్వింపు చర్యలకు పాల్పడగా, ఇండియా అడ్డుకుందన్న సంగతి తెలిసిందే. క్షేత్ర స్థాయి కమాండోలు చర్చలు ప్రారంభించి, వాటిని తదుపరి కొనసాగించాలని నిర్ణయించగా, ఆ సాయంత్రమే చైనా సైనికులు మరోసారి ముందుకు దూసుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఇండియా, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని చైనాకు హెచ్చరికలు పంపింది. సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని సూచించింది.

కాగా, ఉదయం సమయంలో భారత జవాన్లను చైనా దళాలు చుట్టుముట్టి, ఇండియన్ ఆర్మీ అధీనంలో ఉన్న పాంగ్యాంగ్ సరస్సుకు ఎగువభాగాన ఉన్న ప్రాంతాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నించాయని తెలుస్తోంది,. వారిని తీవ్రంగా హెచ్చరించినా కూడా వారు వినకపోవడంతో బాహాబాహీ జరిగిందని సైనిక వర్గాలు తెలిపాయి. బ్రిగేడియర్ స్థాయి అధికారులతో చర్చలు జరుగుతున్న సమయంలో ఈ చర్యలు తగవని తొలుత చెప్పిన భారత సైనిక అధికారులు, చైనా దళాలను సమర్థవంతంగా వెనక్కు పంపగలిగాయి.

ఇదిలావుండగా, ఇండియా దళాలు, చైనా భూభాగంలోకి చొచ్చుకుని వస్తున్నాయని ఢిల్లీలోని చైనా ఎంబసీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలను ఇండియా ఉల్లంఘిస్తోందని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.


More Telugu News