భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా కావాలనే అతిక్రమణలకు దిగుతోంది: అమెరికా

  • సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేకెత్తిస్తున్న చైనా
  • భారత బలగాల పాటవంపై అమెరికా కితాబు
  • ఈ సమయంలో చైనా చర్యలు ఆశ్చర్యకరమన్న అమెరికా
భారత్ సరిహద్దుల్లో చైనా అతిక్రమణలు నిజమేనని మరోసారి రుజువైంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన్ని ఆక్రమించుకునేందుకు చైనా బలగాలు యత్నిస్తున్నాయని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే, చైనా ఉద్దేశపూర్వకంగానే భారత్ ను రెచ్చగొట్టేందుకు ఈ అతిక్రమణలకు పాల్పడుతున్నట్టుందని అమెరికా నిఘా విభాగం అభిప్రాయపడింది.

అంతేకాకుండా, పాంగాంగ్ సరస్సు వద్ద భారత బలగాలతో జరిగిన ఘర్షణ అనంతరం, అక్కడి తమ కమాండర్ బలగాలను తీసుకుని వెనక్కి వచ్చేయడం పట్ల చైనా మండిపడుతోందని కూడా వెల్లడించింది. భారత బలగాలు ఈ సందర్భంగా పోరాట పటిమ చూపడంతో ఎలాంటి భూ ఆక్రమణ జరగలేదని వివరించింది. జూన్ నెలలో గాల్వన్ లోయలో చైనా బలగాలతో ఘర్షణల తర్వాత భారత సైనికులు ఇలాంటి పోరాటాలకు బాగా సన్నద్ధమైనట్టు కనిపిస్తోందని అమెరికా నిఘా విభాగం ఓ నివేదికలో పేర్కొంది.

ఇప్పటికే భారత్ తో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో చైనా ఇటువంటి చర్యలకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తోందని, అయితే, చైనా తన వేలితో తన కన్నునే పొడుచుకుంటుందని తాము భావించలేమని ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు.


More Telugu News