కరోనా వ్యాక్సిన్ పై ఆశలు రేకెత్తిస్తున్న ఫైజర్ ప్రకటన

  • వచ్చే నెల చివరికి తమ వ్యాక్సిన్ సామర్థ్యం తెలుస్తుందన్న ఫైజర్
  • అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని వెల్లడి
  • వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలన్న అమెరికా
ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మా సంస్థలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పోటీలు పడుతున్నాయి. వాటిలో అమెరికాకు చెందిన ఫైజర్ కూడా ఒకటి. ఈ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. జర్మనీకి చెందిన బయో ఎన్టెక్ సంస్థతో కలిసి ఫైజర్ వ్యాక్సిన్ రూపకల్పన చేపడుతోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ రెండు దశల క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తిచేసుకుని మూడో దశ ట్రయల్స్ జరుపుకుంటోంది.

దీనిపై ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా మాట్లాడుతూ, వచ్చే నెల చివరి నాటికి తమ వ్యాక్సిన్ సత్తా వెల్లడవుతుందని తెలిపారు. తమ వ్యాక్సిన్ సామర్థ్యం స్పష్టంగా నిరూపితమైతే వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతుల కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎఫ్ డీఏ)కి దరఖాస్తు చేసుకుంటామని వెల్లడించారు. అటు, ఎఫ్ డీఏ కూడా ప్రభావవంతమైన వ్యాక్సిన్ లకు మూడో దశ పూర్తి కాకున్నా అత్యవసర వాడకానికి అనుమతులు ఇస్తామంటూ సానుకూలంగా స్పందిస్తోంది.

అటు ఎఫ్ డీఏ, ఇటు ఫైజర్ ప్రకటనల నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ మరికొన్ని నెలల్లో వస్తుందన్న ఆశలు కలుగుతున్నాయి. అంతేకాదు, నవంబరు 1 కల్లా అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. చాలా వ్యాక్సిన్లు వచ్చే ఏడాది ఆరంభం నాటికి అందుబాటులోకి వస్తాయన్న అంచనాల నేపథ్యంలో, అమెరికాలో మాత్రం ముందే వ్యాక్సిన్ వినియోగంలోకి రానుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి.


More Telugu News