మీ పాటంటే ఇష్టమన్న పవన్ కల్యాణ్.. తెగ ఆనందపడిపోయిన తమిళ హీరో!

  • పవన్ బర్త్ డేకి విషెస్ చెప్పిన శివకార్తికేయన్
  • రిప్లై ఇస్తూ మీ పాట చాలాసార్లు చూశానన్న పవన్
  • మరింత ఆనందపడుతూ థ్యాంక్స్ చెప్పిన శివ    
పవన్ కల్యాణ్ ఇచ్చిన జవాబు చూసి ఇప్పుడు ఓ తమిళ హీరో ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నాడు. పైగా, తన పాటంటే పవన్ కి బాగా ఇష్టమన్న విషయం ఆయన నుంచే తెలియడంతో మరింత ఆనందానికి లోనవుతున్నాడు. అసలు విషయంలోకి వెళితే, ఇటీవల పవన్ బర్త్ డేను పురస్కరించుకుని చాలామందిలాగే తమిళ హీరో శివకార్తికేయన్ సోషల్ మీడియా ద్వారా పవన్ కి విషెస్ తెలిపాడు.

తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ పవన్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ జవాబులిస్తున్నారు. అలాగే, శివకార్తికేయన్ కి కూడా రిప్లై ఇచ్చారు. 'ప్రియమైన తిరు శివ కార్తికేయన్, మీరు పంపిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. మీరు ఎన్నో విజయాలు సాధించాలని అభిలషిస్తున్నాను. ఇక, మీ 'ఊదా కలర్ రిబ్బన్..' అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటని లెక్కలేనన్నిసార్లు చూశాను' అంటూ పవన్ ట్వీట్ చేయడంతో శివ కార్తికేయన్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.

వెంటనే, మళ్లీ జవాబు ఇస్తూ, 'మీ జవాబు చూసి అమితానందాన్ని పొందాను సార్. ఊదా కలర్ రిబ్బన్ పాట మీకిష్టమని తెలిసి మరింత ఆనందాన్ని పొందాను. మీరు సమయాన్ని వెచ్చించి నాపై ప్రేమ చూపుతూ జవాబు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞుడిని సార్' అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి పవన్ చూపిన ప్రేమకు, మీ పాటంటే ఎంతో ఇష్టమని చెప్పినందుకు శికార్తికేయన్ తెగ ఆనందపడిపోయాడన్న మాట. ఇంతకీ ఈ పాట 'వరుత్త పాడదా వాలిబార్ సంగం' అనే సినిమాలోనిది!  


More Telugu News