అంతర్వేది ఘటన నేపథ్యంలో... మల్లన్న రథానికి భారీ భద్రత!

  • అంతర్వేది ఆలయంలో ప్రమాదం
  • శ్రీశైలం రథాన్ని పరిశీలించిన అధికారులు
  • మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశం
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దశాబ్దాల చరిత్ర గల స్వామివారి రథం, దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం రేపగా, రాష్ట్రంలోని మిగతా ప్రముఖ ఆలయాల్లో ఉన్న రథాల భద్రతపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో, మల్లికార్జున స్వామివారి రథం భద్రతపై ఈఓ కేఎస్ రామారావు, ఈఈ మురళీ బాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. రథాన్ని తనిఖీ చేసి, భద్రతను మరింతగా పెంచాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావును ఆదేశించారు.

రథం పరిసరాల్లో అన్ని కోణాల్లోనూ సీసీటీవీల నిఘా ఉంచాలని, ఈ విషయంలో గంగాధర మండపం వద్ద విధుల్లో ఉండే సెక్యూరిటీ ఉద్యోగులు మరింతగా దృష్టిని సారించాలని ఈఓ ఆదేశించారు. సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. తిరుమల తరహాలో టోల్ గేటు వద్దనే లగేజీని స్కానింగ్ చేసి, శ్రీశైలంలోకి భక్తులను అనుమతించే విషయమై తగిన చర్యలు తీసుకోవాలని ఈఓ సూచించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే వారాంతాల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


More Telugu News