క్షిపణులను భారత్ వైపు గురిపెట్టిన చైనా... కానీ అక్కడ మనదే పైచేయి!

  • చైనా స్థావరాల కన్నా ఎత్తున భారత జవాన్లు
  • ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధం
  • ఫైటర్ జెట్లను మోహరించిన ఇరు దేశాలు
చైనాతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. నిత్యమూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా, తాజాగా, భారీ ఎత్తున క్షిపణులను తీసుకుని వచ్చి, వాటిని భారత్ వైపు మోహరించడంతో భారత దళాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా రెజాంగ్ లా సమీపంలో చైనా దళాలు దూకుడుగా వ్యవహరిస్తుండగా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారత దళాలు సన్నద్ధంగా ఉన్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ఇక రెజాంగ్ లా పరిధిలో సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున భారత్ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఇవి తాజా శాటిలైట్ చిత్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఇదే ప్రాంతంలో చైనా దళాలు 4 వేల మీటర్ల ఎత్తు వరకూ మాత్రమే వెళ్లగలిగాయి. చైనా దళాలతో పోలిస్తే, భారత జవాన్లు దాదాపు కిలోమీటర్ ఎత్తున మోహరించి వుండటంతో, మనదే పైచేయిగా ఉందని ఆర్మీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఇక ఈ ప్రాంతంలో చైనా తన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధ విమానాలను, రాడార్లను, విమాన విధ్వంసక క్షిపణులను మోహరించగా, ఇండియా మిగ్, సుఖోయ్ తదితర ఫైటర్ జెట్లతో అనుక్షణమూ పహారా కాస్తోంది. రష్యా నుంచి తెప్పించిన ఫైటర్ జెట్ విధ్వంసక క్షిపణులను కూడా లడఖ్ ప్రాంతానికి తరలించింది. ఇక నేడు జాతికి అంకితమై, సైన్యానికి వెన్నుదన్నుగా నిలవనున్న రాఫెల్ యుద్ధ విమానాలను సైతం సాధ్యమైనంత తక్కువ సమయంలోనే చైనా సరిహద్దులకు తరలించాలని భావిస్తున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.


More Telugu News