మాస్కోలో సమావేశమైన భారత్, చైనా విదేశాంగ మంత్రులు!

  • షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు
  • ప్రత్యేకంగా సమావేశమైన జై శంకర్, వాంగీ యీ
  • ద్వైపాక్షిక చర్చలను కొనసాగించాలని నిర్ణయం
చైనాతో సరిహద్దుల్లో నిత్యమూ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో, షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశాల్లో పాల్గొనేందుకు మాస్కోకు వెళ్లిన భారత్, చైనా విదేశాంగ మంత్రులు ఎస్ జై శంకర్, వాంగీ యీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. దాదాపు రెండున్నర గంటల పాటు వీరి మధ్య చర్చలు జరుగగా, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా ఇరు నేతలూ మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు రష్యా - ఇండియా - చైనాలు సంయుక్తంగా విందును ఏర్పాటు చేసిన సమయంలోనూ జై శంకర్, వాంగ్ యీ కలిశారు.

ఎల్ఏసీ వెంబడి, దాదాపు 45 సంవత్సరాల తరువాత తొలిసారిగా తుపాకీ చప్పుళ్లు వినిపించిన సంగతి తెలిసిందే. తప్పు మీదంటే, మీదని ఇరుదేశాలూ ఒకరిపై ఒకరు ఆరోపణలు కురిపించాయి. గత వారంలో మీడియాతో మాట్లాడిన జై శంకర్, తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, పరిస్థితులను తిరిగి చక్కదిద్దేందుకు రాజకీయ నాయకుల స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగగా, పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సరిహద్దుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాలని ఇరు నేతలూ అభిప్రాయపడ్డారని అధికార వర్గాలు వెల్లడించాయి. సైనిక స్థాయి చర్చలను కొనసాగిస్తూనే, ద్వైపాక్షిక స్థాయి చర్చలు జరపాలని కూడా వీరు నిర్ణయించుకున్నారు. గడచిన వారంరోజుల వ్యవధిలో పాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలో నెలకొన్న స్థితిపై వీరు ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్టు సమాచారం.


More Telugu News