ఇరాన్‌పై మళ్లీ ఆంక్షలు.. అమెరికా చర్య చట్ట విరుద్ధమంటున్న మిత్ర దేశాలు

  • 2015 నాటి ఐరాస ఆంక్షలను పునరుద్ధరించిన అమెరికా
  • అమెరికాకు ఆ హక్కు లేదంటున్న మిత్ర దేశాలు
  • నేడు ఉత్తర్వులు జారీ చేయనున్న వైట్ హౌస్
ఇరాన్‌పై అమెరికా మరోమారు కొరడా ఝళిపించింది. ఆ దేశంపై ఐక్యరాజ్య సమితి గతంలో విధించిన ఆంక్షలను తిరిగి విధించింది. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జేసీపీవోఏ) నిబంధనలను పాటించడంలో ఇరాన్ విఫలమైందని, అందుకే ఆంక్షలను పునరుద్ధరించినట్టు తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. తమకున్న హక్కుల ప్రకారం భద్రతా మండలి 2015లో విధించిన ఆంక్షలను పునరుద్ధరిస్తున్నట్టు పాంపియో తెలిపారు.

నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత 30 రోజుల గడువు ముగియడంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయన్నారు. అమెరికా తాజా నిర్ణయం నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

నిబంధనలు ఉల్లంఘించిన ఇరాన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై అమెరికా నేడు ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తప్పనిసరిగా ఈ ఆంక్షలన్నింటినీ పాటించాల్సి ఉంటుందని పాంపియో తెలిపారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అమెరికా తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మిత్రదేశాలు దానిని పట్టించుకోవాల్సిన పనిలేదని తీర్మానించాయి. అంతేకాదు, అణు ఒప్పందం నుంచి తప్పుకున్న రోజే ఆంక్షలు విధించే హక్కును అమెరికా కోల్పోయిందని విమర్శించాయి. అయితే, మండలిలో సభ్యదేశంగా ఉన్న తమకు ఆంక్షలు విధించే హక్కు ఉంటుందని అమెరికా వాదించింది.


More Telugu News