అమరావతిపై స్టేటస్ కోను అక్టోబరు 5 వరకు పొడిగించిన ఏపీ హైకోర్టు

  • రాజధాని తరలింపుపై గతంలో స్టేటస్ కో
  • ఇకపై అంశాల వారీగా హైకోర్టులో విచారణ
  • తదుపరి విచారణ అక్టోబరు 5కి వాయిదా
అమరావతి నుంచి ఏపీ రాజధాని తరలింపుపై గతంలో ఇచ్చిన స్టేటస్ కోను హైకోర్టు అక్టోబరు 5 వరకు పొడిగించింది. రాజధాని పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 5కి వాయిదా వేసింది. ఇకపై అంశాల వారీగా పిటిషన్ల విచారణ జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం నిర్ణయించింది.  

తాజా విచారణ సందర్భంగా.... విశాఖలో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని చెబుతూ, దీనిపై రాష్ట్ర సీఎస్ సంతకంతో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాంతో, తమకు వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

కాగా, రాజధాని అమరావతికి సంబంధించిన అంశాలపై ఇప్పటివరకు హైకోర్టులో 93 పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతి రైతులు, రైతు పరిరక్షణ సమితి నేతలు, మాజీ శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లు కూడా వాటిలో ఉన్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లు, జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్టబద్ధత ఇత్యాది అంశాలపై ఈ పిటిషన్లు వేశారు.

రాజధాని రైతులు సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘన, రాజధాని మాస్టర్ ప్లాన్ డీవియేషన్ పైనా, మౌలిక సదుపాయాల కల్పన చేయకపోవడం పైనా, రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపుపైనా రైతులు పిటిషన్లు వేయడం జరిగింది. 


More Telugu News