చైనాపై 14 దేశాల ప్రజల అసంతృప్తి

  • అమెరికా సంస్థ సర్వేలో వెల్లడి
  • ప్రపంచ దేశాల పట్ల చైనా ప్రవర్తిస్తోన్న తీరుపై ఆగ్రహం
  • కరోనా నేపథ్యంలో విమర్శలు
  • జిన్‌పింగ్‌ను నమ్మలేమంటోన్న ప్రజలు
ప్రపంచ దేశాల పట్ల చైనా ప్రవర్తిస్తోన్న తీరుతో అనేక దేశాల ప్రజలు డ్రాగన్‌ కంట్రీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనాను దాచి పెడుతూ ప్రపంచానికి పాకేలా చేసిందని చైనాపై ప్రపంచ దేశాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా తీరుపై ప్రజల అభిప్రాయాలను అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకుంది.

చైనాపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజల సంఖ్య పెరిగిపోతోందని తమ సర్వేలో తేలిందని స్పష్టం చేసింది. సర్వేలో భాగంగా జూన్‌ 10 నుంచి ఆగస్టు 3 వరకు దాదాపు 14 దేశాల్లోని 14 వేల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను ఫోన్‌ ద్వారా సేకరించారు. వీరిలో అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, కెనడా, బ్రిటన్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్ దేశాల ప్రజలున్నారు.

చాలా మంది కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగానే చైనా పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారని తేలింది. ఈ విషయంలో చైనా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని 61 శాతం మంది చెప్పారు. అమెరికా నుంచి అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిలో 84 శాతం మంది చైనా తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది ప్రజలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో సంబంధాల విషయంలో జిన్‌పింగ్‌ను నమ్మలేమని అన్నారు. జర్మనీ ప్రజలు మాత్రం ట్రంప్‌పై అసంతృప్తితో ఉన్నారు. 89 శాతం మంది ట్రంప్‌పై నమ్మకం లేదని చెప్పగా,  78 శాతం ప్రజలు జిన్‌పింగ్‌పై నమ్మకం లేదని తెలిపారు.


More Telugu News