ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఐపీఎల్ కు దూరమైన అమెరికా క్రికెటర్

  • గాయపడిన అలీఖాన్
  • కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అలీఖాన్
  • ఘనత అందుకోకుండానే నిష్క్రమణ
అమెరికాకు చెందిన 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అలీఖాన్ ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ అయినా ఆడుంటే అదో ఘనత అయ్యేది. అమెరికా జాతీయ క్రికెట్ జట్టు ఆటగాడొకరు ఐపీఎల్ ఆడిన రికార్డు దక్కేది. అయితే అలీఖాన్ కు ఆ అవకాశం చేజారింది. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అలీఖాన్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

ఐపీఎల్ ప్రారంభానికి ముందు నైట్ రైడర్స్ సీమర్ హ్యారీ గుర్నీ భుజం గాయంతో తప్పుకున్నాడు. అతడి స్థానంలో అలీఖాన్ కు జట్టు మేనేజ్ మెంట్ అవకాశం ఇచ్చింది. అయితే తన తొలి మ్యాచ్ ఆడకముందే అలీఖాన్ గాయపడ్డాడు.

జన్మతః పాకిస్థానీ అయిన అలీఖాన్ అమెరికా జాతీయ క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఎంతో ప్రతిభావంతుడైన పేసర్ గా గుర్తింపు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు గాయపడడంతో ఐపీఎల్ లో అతడి బౌలింగ్ చూసే వీల్లేకపోయింది. కాగా అలీఖాన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. అలీఖాన్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రింబాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


More Telugu News