రిచాపై నిరాధార వ్యాఖ్యలు చేశా... క్షమించండి: హైకోర్టును కోరిన నటి పాయల్ ఘోష్

  • ఇటీవల రిచాపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్
  • పరువు నష్టం దావా వేసిన రిచా
  • పాయల్ క్షమాపణలను స్వీకరించిన రిచా
నటి రిచా చద్దాపై తాను నిరాధారమైన ఆరోపణలను చేశానని, అందుకు తనను క్షమించాలని కోరుతూ నటి పాయల్ ఘోష్, బాంబే హైకోర్టులో పేర్కొంది. తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్, లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ, ఈ క్రమంలో పాయల్, రిచాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై పాయల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రిచా, బాంబే హైకోర్టులో పాయల్ పై పరువు నష్టం దావా వేసింది.

ఈ నేపథ్యంలో రిచా పిటిషన్ ను జస్టిస్ మీనన్ విచారించారు. కోర్టుకు హాజరైన పాయల్ తరఫు న్యాయవాది నితిన్ పాట్పుట్, తన క్లయింట్ పాయల్ క్షమాపణలు కోరుతున్నారని తెలిపారు.వాస్తవానికి తన క్లయింట్ రిచాకు అభిమాని అని, ఆమెపై అన్ని వేళలా గౌరవాన్ని చూపుతారని, ఆమెను కించపరచాలని తన క్లయింట్ భావించలేదని వివరణ ఇచ్చారు.

ఇదే సమయంలో పాయల్ ఘోష్ క్షమాపణలను స్వీకరించేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉన్నారని రిచా తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది వీరేంద్ర తుల్జాపూర్కర్, సవీనా బేడీలు న్యాయమూర్తికి స్పష్టం చేశారు. నష్టపరిహారాన్ని పొందాలని కూడా రిచా భావించడం లేదని తెలిపారు.ఆపై రెండు పార్టీల సమ్మతి నిబంధనలను 12వ తేదీన సమర్పించాలని ఆదేశించిన జస్టిస్ మీనన్ తదుపరి విచారణను వాయిదా వేశారు.రిచాపై ఏ వ్యక్తి కూడా నిరాధార ఆరోపణలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.


More Telugu News