బాగా డబ్బున్న నిర్మాత చెత్త సినిమా తీసి తానే ఆడించుకున్నట్టుంది: అమరావతి ఉద్యమం నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలు

  • అమరావతి ఉద్యమానికి 300 రోజులు
  • ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలు
  • టీడీపీ నేతలు ఇక్కడుండి ఎందుకు పోరాడడంలేదన్న సజ్జల
  • ఇప్పుడక్కడ రియల్ ఎస్టేట్ వాళ్లు మాత్రమే ఉన్నారని వ్యాఖ్యలు
అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజలు పాల్గొనే ఉద్యమాలు ఉత్తేజంతో కూడుకుని ఉంటాయని, కానీ ఇవాళ మీరు చేస్తున్న పనులు 'ఉద్యమం' అనే మాటకు అవమానం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు.

ఇది కేవలం మీడియా ద్వారా జరుగుతున్న ఉద్యమం అని వ్యాఖ్యానించారు. బాగా డబ్బున్న నిర్మాత ఓ చెత్త సినిమా తీసి తానే ఆడించుకుని, రికార్డులు బద్దలయ్యాయని వేడుకలు చేసుకున్నట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు.  ఈ కార్యక్రమంలో కొందరు అమాయకులు కూడా ఉన్నారని, తాను వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని సజ్జల స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేశ్ లను కూడా టార్గెట్ చేశారు. ఉద్యమం అని చెప్పే టీడీపీ నాయకులు ఇక్కడికి ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. రైతుల ఉసురు తగులుతుందని లోకేశ్ చెప్పే మాటలు నవ్వు తెప్పించేలా ఉన్నాయని, ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అని, చారిత్రక ఆవశ్యకత అని అంటుంటారని ఎద్దేవా చేశారు.

అమరావతి ఉద్యమాన్ని ఎప్పుడో వదిలేసి ఎప్పుడో వలస పక్షుల్లా వచ్చిపోతున్నారని విమర్శించారు. అమరావతి ఉద్యమం నిజమైనదే అయితే మీరు ఇక్కడే ఉండి ఎందుకు పోరాడడంలేదని నిలదీశారు. అమరావతిలో ఉన్న నిజమైన రైతులు మీరు ఎప్పుడు ఉద్యమం వదిలేస్తారా? అని చూస్తున్నారు... ఇప్పుడక్కడ ఉన్నది కేవలం రియల్ ఎస్టేట్ వాళ్లు మాత్రమేనని సజ్జల స్పష్టం చేశారు.


More Telugu News