అందరూ కూరగాయలు పండించుకోవాలి.. లేదంటే తిండి దొరకదు: పూరీ జగన్నాథ్

  • ‘వెర్టికల్ ఫార్మింగ్’ గురించి మాట్లాడిన పూరీ
  • 7 వేల సంవత్సరాల క్రితమే వ్యవసాయం నేర్చుకున్నాం
  • ఎన్నో పద్ధతుల్లో పంటలు పండిస్తున్నాం
  • 2 ఎకరాల్లో పండించే కూరగాయలను 200 గజాల్లో పండించొచ్చు
పూరీ మ్యూజింగ్స్ పేరుతో తన అభిప్రాయాల గురించి మాట్లాడుతోన్న దర్శకుడు పూరీ జగన్నాథ్ తాజాగా ‘వెర్టికల్ ఫార్మింగ్’ గురించి మాట్లాడారు. మనం 7 వేల సంవత్సరాల క్రితమే వ్యవసాయం నేర్చుకున్నామని, ఇప్పుడు ఎన్నో పద్ధతుల్లో పంటలు పండిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఇందులో తాజా పద్ధతే వెర్టికల్ ఫార్మింగని తెలిపారు.

దీని ద్వారా మనకు కావాల్సిన కూరగాయలను మనమే పండించుకోవచ్చని, ఇందుకోసం భూమి అవసరం లేదని ఆయన చెప్పారు. మన టెర్రస్ పై, బాల్కనీలో, పార్కింగ్ ప్రాంతంలోనూ పండించుకోవచ్చని తెలిపారు.  అంతేగాక, పొలంలో 100 లీటర్ల నీరు వాడితే, ఈ పద్ధతిలో మాత్రం 5 లీటర్ల నీరు సరిపోతుందని, పురుగుల మందులు కూడా వాడకుండా మనమే పెంచుకోవచ్చని తెలిపారు.

అంతేగాక, రెండు ఎకరాల్లో పండించే కూరగాయలను 200 గజాల్లో పండించొచ్చని తెలిపారు. జనాభా పెరుగుతోన్న క్రమంలో రాబోయే పాతికేళ్లలో ఇప్పటి కంటే 70 శాతం వ్యవసాయం పెరగాల్సి ఉంటుందని, లేకపోతే మనకు ఆహారం దొరకదని చెప్పారు. రోజుకు నాలుగు లక్షల మంది పిల్లలు పుడుతున్నారని ఆయన అన్నారు.

రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచ జనాభా సంఖ్య మరో 200 కోట్లు అధికమవుతుందని  పూరీ చెప్పారు. ఈ నేపథ్యంలో మనం రైతుల్లా మారిపోవాలని, మన వంట గది పక్కనే కూరగాయలు పండించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఇంట్లోనూ రైతు పుట్టాల్సిన సమయం ఆసన్నమైందని, లేదంటే రాబోయే రోజుల్లో మనకు తిండి దొరకదని తెలిపారు. వెర్టికల్ ఫార్మింగ్ పై  సర్కారు దృష్టి సారించాలని, ప్రతి గ్రామంలోనూ ప్రోత్సహించాలని చెప్పారు.


More Telugu News