విజయసాయిరెడ్డి, బొత్స, అవంతి రూ. 23 కోట్లు కాజేశారు: అయ్యన్నపాత్రుడు

  • జగన్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోంది
  • విజయసాయి కొనసాగిస్తున్న దోపిడీ జగన్ కు తెలియదా?
  • జయరాంను జగన్ ఎందుకు కాపాడుతున్నారు?
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు. మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరూ భూ అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ. 4 వేల వరకు దోపిడీ జరిగిందని అన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తున్నా జగన్ మౌనంగా ఉంటున్నారని.... జగన్ తీరు చూస్తుంటే ఈ అవినీతిలో సీఎంకు కూడా భాగం ఉందేమోనని ప్రజలు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

విశాఖ కేంద్రంగా విజయసాయి కొనసాగిస్తున్న దోపిడీ జగన్ కు తెలియదా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ భూములు, సింహాచలం భూములు కొట్టేయడానికి విజయసాయి చేస్తున్న ప్రయత్నాలు కనిపించడం లేదా? అని అడిగారు. విశాఖ నగర పరిధిలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే భూమి చదును పేరుతో విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స, అవంతి శ్రీనివాస్ లు రూ. 23 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మంత్రి జయరాం అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టినా... ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. అవినీతి మంత్రిని జగన్ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. జయరాంపై చర్యలు తీసుకుంటే... మీ అవినీతిని ఆయన ఎక్కడ బయటపెడతారో అని భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. జయరాంపై జగన్ చర్యలు తీసుకోకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.


More Telugu News