మొన్న చిన్నారి, నేడు తేజస్విని బలి... రక్షణ ఇవ్వని చట్టాలతో ప్రయోజనం ఏంటి?: పవన్ కల్యాణ్

  • విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం
  • దివ్య తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని బలి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • ప్రచారం చేసుకోవడానికేనా చట్టాలు? అంటూ ఆగ్రహం 
విజయవాడలో దివ్య తేజస్విని అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోవడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. దివ్య తేజస్విని ఘటన తెలియగానే ఎంతో బాధ కలిగిందని తెలిపారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడాలన్న ఆశలతో ఉన్న తమ బిడ్డ హత్యకు గురికావడం కన్నవారికి గర్భశోకాన్ని మిగుల్చుతుందని పేర్కొన్నారు. ఇటీవలే విజయవాడలో చిన్నారి అనే నర్సు కూడా ఇలాగే ప్రేమ వేధింపుల బారినపడి చనిపోయిందని తెలిపారు.

చిన్నారి, దివ్య తేజస్వినిల హత్యలు అత్యంత హృదయవిదారకం అని పవన్ అన్నారు. రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల కేసులు పెరిగిపోతున్నాయని, దిశ చట్టం చేశాం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టంతో ఏం సాధించింది? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ప్రయోజనం ఏంటి? అని నిలదీశారు. కేవలం ప్రచారానికే చట్టాలు పరిమితమవుతున్నాయని పవన్ విమర్శించారు.

ఇలాంటి ఘటనల్లో పోలీసుల వైఖరి సరిగా ఉండడంలేదని, తిరుపతిలో ఇటీవల ఓ బాలిక మత ప్రచారకుడి చేతిలో లైంగిక దాడికి గురైతే పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలిపారు. దాంతో బాలిక స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇకనైనా పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తూ మహిళల రక్షణ కోసం చేసిన చట్టాన్ని బలంగా ప్రయోగించాలని, నిందితులకు కఠినంగా శిక్షలు విధించినప్పుడే తమ రక్షణ కోసం చేసిన చట్టాలపై మహిళల్లో నమ్మకం ఏర్పడుతుందని జనసేనాని పేర్కొన్నారు.


More Telugu News