మురళీధరన్ బయోపిక్ లో నటించడంపై విజయ్ సేతుపతి మరోసారి ఆలోచిస్తే బెటర్: తమిళనాడు మంత్రి జయకుమార్

  • క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితంపై సినిమా
  • '800' బయోపిక్ లో మురళీ పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి
  • విజయ్ సరైన నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి జయకుమార్
శ్రీలంక ఆఫ్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న '800' బయోపిక్ పై రాజకీయ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమాలో మురళీధరన్ పాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతిపై ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. ఆ పాత్రలో నటించవద్దంటున్న వారి జాబితాలో ఇప్పుడు అధికార అన్నాడీఎంకే కూడా చేరింది. మురళీధరన్ బయోపిక్ లో నటించడంపై విజయ్ సేతుపతి మరోసారి ఆలోచించుకుంటే బాగుంటుందని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.

తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, 2009లో శ్రీలంకలో జరిగిన పౌర యుద్ధానికి నాటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స బాధ్యుడని, లంకలో తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సకు మద్దతు ఇస్తున్న మురళీధరన్ ను తమిళులు ఏవిధంగా ఆమోదిస్తారని జయకుమార్ ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ విజయ్ సేతుపతి పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.

ఇప్పుడు విజయ్ సేతుపతి అభిమానులు సైతం ఆయన చర్యను అంగీకరించని పరిస్థితి ఏర్పడిందని, ఒకవేళ సినిమా నుంచి తప్పుకుంటే మాత్రం విజయ్ సేతుపతి కీర్తి మరింత పెరుగుతుందని వివరించారు.


More Telugu News