గుడివాడలో పట్టపగలు దారుణం.. మహిళ నుదుటిపై తుపాకి గురిపెట్టి ఆభరణాలు చోరీ

  • అమ్మకానికి ఉన్న ఇల్లు చూసేందుకు వచ్చిన ఆగంతుకుడు
  • నీళ్లు రావడం లేదంటూ బాత్‌రూం వద్దకు పిలిచిన నిందితుడు
  • వృద్ధురాలిని బెదిరించి బంగారు నగలు లాక్కుని పరార్
కృష్ణా జిల్లాలోని గుడివాడలో పట్టపగలే దారుణం జరిగింది. అమ్మకానికి ఉన్న ఇల్లును చూసేందుకు వచ్చిన ఓ ఆగంతుకుడు ఇంట్లోని వృద్ధురాలి నుదుటిపై తుపాకి పెట్టి బెదిరించి ఆభరణాలను దోచుకున్నాడు. నిన్న ఉదయం 11.30 గంటలకు స్థానిక టీచర్స్ కాలనీలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే గడ్డం రత్నకుమారి (62) తన ఇంటిలోని కింది భాగాన్ని అమ్మకానికి పెట్టారు. షాపింగ్ ‌మాల్‌లో పనిచేసే ఆమె కుమార్తె శ్రీదేవి తల్లికి ఫోన్ చేసి ఇల్లు కావాలని ఎవరో తనకు ఫోన్ చేశారని, వారొస్తే చూపించాలని తల్లికి చెప్పారు. ఫోన్ పెట్టేసిన కాసేపటికే బైక్‌పై వచ్చిన ఓ ఆగంతుకుడు అక్కడికి చేరుకుని అమ్మకానికి పెట్టిన ఇల్లు ఇదేనా? అని రత్నకుమారిని ప్రశ్నించాడు.

అనంతరం లోపలికి వెళ్లి ఇంటిని పరిశీలించాడు. ఇల్లంతా తిరిగి చూసిన తర్వాత సింక్ దగ్గరికి వెళ్లి నీళ్లు రావడం లేదని చెప్పాడు. స్పందించిన రత్నకుమారి ట్యాపులన్నీ పనిచేస్తున్నాయని సమాధానమిచ్చింది. దీంతో బాత్‌రూం వద్దకు వెళ్లిన నిందితుడు అక్కడ కూడా నీళ్లు రావడం లేదని చెప్పడంతో చూసేందుకు రత్నకుమారి అక్కడకు వెళ్లింది.

అదే అదునుగా భావించిన ఆగంతుకుడు ఆమె మెడపట్టుకుని చేతికున్న బంగారు గాజులు తీసివ్వాలని బెదిరించాడు. మరోమార్గం లేక ఆమె వాటిని తీసిచ్చింది. ఆ తర్వాత మెడలోని గొలుసును కూడా ఇవ్వాలని బెదిరించడంతో ఆమె నిరాకరించింది. దీంతో జేబులోంచి తుపాకి తీసిన నిందితుడు ఆమె నుదిటిపై గురిపెట్టి గొలుసు లాక్కున్నాడు. అనంతరం ఆమెను బాత్‌రూంలోకి తోసి గడియపెట్టి పరారయ్యాడు.

కాసేపటికి తేరుకున్న రత్నకుమారి బాత్‌రూంకు ఉన్న మరో తలుపు ద్వారా బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. అయితే, అప్పటికే దుండగుడు పరారయ్యాడు. మొత్తం 9 కాసుల బంగారు ఆభరణాలను నిందితుడు దోచుకెళ్లినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News