ఆ విషయాన్ని మరోసారి నిరూపించిన దర్శకుడు క్రిష్!

  • స్పీడుగా షూటింగ్ చేసే దర్శకులలో క్రిష్ ఒకరు 
  • వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా తాజా చిత్రం
  • వికారాబాద్ అడవుల్లో 35 రోజుల్లో షూటింగ్
  • ఇక ఒక్క పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్  
పక్కాగా స్క్రిప్ట్ తయారుచేసుకుని పెట్టుకునే దర్శకులు.. పక్కా షెడ్యూల్ వేసుకున్న వాళ్లు చాలావరకు తక్కువ సమయంలోనే చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేస్తుంటారు. ఒకరోజు అదనంగా షూటింగ్ పెరిగితే నిర్మాతకు బడ్జెట్టు ఎంత పెరుగుతుందన్న విషయాన్ని వాళ్లు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుంటారు. అందుకే, అన్నీ ముందే పక్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగి, స్పీడుగా షూటింగ్ పూర్తిచేసేస్తూ వుంటారు. అలా స్పీడుగా షూటింగ్ పూర్తిచేసే టాలీవుడ్ దర్శకుడిగా క్రిష్ కు కూడా మంచి పేరుంది. ఇప్పుడు దీనిని ఆయన మరోసారి నిరూపించుకున్నారు.

ఇటీవల క్రిష్ ఒక సినిమాని ప్రారంభించారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అటవీ నేపథ్యంలో సాగే కథ కావడం వల్ల ఈ చిత్రం షూటింగును హైదరాబాదు సమీపంలోని వికారాబాద్ అడవుల్లో నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. భారీ వర్షాలు పడ్డప్పటికీ ఆపకుండా, అందుకు తగ్గా సన్నివేశాలను వర్షాలలో చిత్రీకరించి.. మొత్తానికి 35 రోజుల్లో షూటింగును పూర్తిచేశారు. ఇక ఒక్క పాట చిత్రీకరణ మాత్రం మిగిలివుందని తెలుస్తోంది. ఈ పాట చిత్రీకరణను నాలుగైదు రోజుల్లో పూర్తిచేస్తారు. అసలు షూటింగులు అంటేనే భయపడిపోతున్న ప్రస్తుత కఠిన విషమ పరిస్థితులలో సైతం తాను అనుకున్న రోజుల్లో షూటింగును పూర్తిచేసిన దర్శకుడు క్రిష్ ను ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు.


More Telugu News