సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో సంజయ్‌కు ఉరిశిక్ష

  • నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం
  • చనిపోయేంత వరకు ఉరితీయాలని న్యాయమూర్తి తీర్పు
  • ఒక హత్యను కప్పి పుచ్చుకునేందుకు 9 హత్యలు చేసిన దోషి
సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో సంజయ్‌కు ఉరిశిక్ష
వరంగల్ జిల్లా గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్‌ యాదవ్‌ (40)ను దోషిగా తేల్చిన వరంగల్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి కావూరి జయకుమార్ నిన్న తీర్పు వెలువరించారు.  దోషి సంజయ్ కుమార్ చేతిలో హత్యకు గురైన వారు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు. సంజయ్ కుమార్ బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లా దౌలత్ పూర్‌కు చెందిన వాడు.  

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. బీహార్ నుంచి వలస వచ్చి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని గోనెసంచుల తయారీ కంపెనీలో సంజయ్ పనిచేస్తున్నాడు. రఫిక అనే వివాహితతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తె పై కన్నేశాడు. విషయం తెలిసిన రఫిక అతడిని హెచ్చరించింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇంటికెళ్లి పెద్దలతో మాట్లాడదామని చెప్పి ఈ ఏడాది మార్చి 6న గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రెండు వేర్వేరు టికెట్లు తీసుకున్నాడు.

మార్గమధ్యంలో నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను రఫికతో తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత గొంతు నులిమి నిడదవోలు సమీపంలో రైలు నుంచి కిందికి తోసేశాడు. అనంతరం రాజమండ్రిలో దిగిపోయిన సంజయ్ తిరిగి వరంగల్ చేరుకున్నాడు. రఫిక కుమార్తె అయిన మైనర్‌ను లొంగదీసుకున్నాడు. తల్లి గురించి అడిగిన ప్రతిసారీ మాయమాటలు చెప్పేవాడు.

మరోవైపు, రఫిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మక్సూద్ ఆలం, నిషా ఆలం కలిసి సంజయ్‌ను నిలదీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో హత్య విషయం బయటపడి పోతుందని భావించి, వారిని కూడా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

వారిని హత్య చేసేందుకు పథకం రచించిన సంజయ్‌కు మక్సూద్ కుమారుడి పుట్టిన రోజు కలిసి వచ్చింది. ఇదే అదునుగా భావించి 60 నిద్రమాత్రలు కొనుగోలు చేసి పుట్టిన రోజు నాటి రాత్రి భోజన సమయంలో కూరలో కలిపేశాడు. నిద్రమాత్రలు కలిపిన భోజనం చేసిన మక్సూద్‌ ఆలం, నిషా ఆలం, సోహెల్‌ ఆలం, బూష్రా, బబ్లూ, షకీల్, షాబాజ్‌ అలీతో పాటు వారి పక్క గదిలోనే ఉండే బీహార్‌కు చెందిన  శ్రీరాంకుమార్, శ్యాంకుమార్‌ షా స్పృహ కోల్పోయారు.

ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న సంజయ్ కుమార్.. వారు బతికి ఉండగానే మొత్తం 9 మందినీ గోనె సంచుల్లో వేసి గొర్రెకుంట బావిలో పడేశాడు. తర్వాతి రోజు వీరి మృతదేహాలు బావిలో తేలడంతో హత్య విషయం వెలుగుచూసింది. కుటుంబ సభ్యులందరూ మరణించడంతో పోలీసులు తొలుత దీనిని ఆత్మహత్యగా అనుమానించారు. అయితే, వారి పక్క గదిలో ఉండే బీహార్ వాసులు కూడా మృతి చెందడంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబరు 21న విచారణ ప్రారంభించిన కోర్టు అత్యంత వేగంగా 40 రోజుల్లోనే పూర్తి చేసి నిన్న తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం నిందితుడు సంజయ్‌ను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అతడు చనిపోయేంత వరకు ఉరితీయాలని న్యాయమూర్తి జయకుమార్ తీర్పు చెప్పారు. అలాగే, అతడిపై ఇతర అభియోగాలు కూడా నమోదు కావడంతో వాటిలో జీవితఖైదు, జైలు శిక్ష, జరిమానా విధించారు.


More Telugu News