చట్టసభలోకి బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్.. ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్న శివసేన!

  • గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిన ఊర్మిళ
  • కాంగ్రెస్‌‌కు గుడ్‌బై చెప్పి ఎన్సీపీలో చేరిక
  • ఊర్మిళ నామినేషన్‌ను ధ్రువీకరించిన సంజయ్ రౌత్
బాలీవుడ్‌కు చెందిన మరో బ్యూటీ క్వీన్ చట్టసభలో అడుగుపెట్టబోతోంది. ప్రముఖ నటి, ‘రంగీలా’ ఫేం ఊర్మిళ మతోండ్కర్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని అధికార శివసేన నిర్ణయించింది. మండలిలో త్వరలో ఖాళీ కానున్న 12 స్థానాలకు గాను గవర్నర్ కోటాలో ఊర్మిళను నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన ‘మహా వికాస్ అఘాడీ’ నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఊర్మిళను ఎమ్మెల్సీగా నామినేట్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ధ్రువీకరించారు. అయితే, మూడు పార్టీల నేతలతో మరోమారు చర్చించిన అనంతరం అభ్యర్థుల జాబితాను సీఎంకు పంపుతామని, ఆయన తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

కాగా, ఎమ్మెల్సీ జాబితాలో మరాఠీ నటుడు ఆదేష్‌ బండేకర్‌, సింగర్‌ ఆనంద్‌ షిండే, ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ఎన్‌సీపీలో చేరిన సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ ఖడ్సేలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ నార్త్ ముంబై నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె పార్టీని వీడి శివసేనలో చేరారు.


More Telugu News