ప్రముఖ రేడియో న్యూస్ రీడర్ ఏడిద గోపాలరావు కన్నుమూత... విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్!

  • సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
  • ఏడిద రంగస్థలంపైనా పేరు తెచ్చుకున్నారని వెల్లడి
  • గతంలో మాస్కో రేడియోలోనూ వార్తలు చదివిన ఏడిద
రేడియో మాధ్యమం ఎంతో ప్రజాదరణ పొందిన రోజుల్లో అప్పటివారికి "ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది ఏడిద గోపాలరావు" అనే స్వరం బాగా పరిచయం ఉండే ఉంటుంది. స్పష్టమైన గళంతో ఆయన వార్తలు చదివే విధానం అనేకమందిని ఆకట్టుకుంది. అయితే, అభిమానులను, నాటితరం రేడియో ప్రియులను విషాదంలో ముంచెత్తుతూ ఏడిద గోపాలరావు (83) కన్నుమూశారు. ఈ ఉదయం హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రేడియోలో వార్తలు చదవడమే కాకుండా, రంగస్థల నటుడిగానూ ఏడిద గోపాలరావు ఎంతో పేరు తెచ్చుకున్నారని వివరించారు. వివిధ సాంస్కృతిక సంస్థలు, పలు సంఘాల కార్యక్రమాలకు తనవంతు సహకారాలు అందించారని కొనియాడారు. ఏడిద కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా, ఏడిద గోపాలరావు ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు స్వయానా సోదరుడు. ఏడిద గోపాలరావు ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంలో వార్తలు చదివారు. నాలుగేళ్ల  పాటు రష్యాలోనూ ఉండి మాస్కో రేడియోలో భారత్ కు చెందిన వార్తలు చదివారు. సరస నవరస అనే నాటక పరిషత్తును స్థాపించి ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో జాతీయస్థాయి నాటకోత్సవాలు నిర్వహించారు. గోపాల తరంగాలు పేరిట కవితలు కూడా రాశారు.


More Telugu News