ఢిల్లీ ఎయిర్ పోర్టులో సుజనాను అడ్డుకున్న అధికారులు... తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ!

  • బ్యాంకు ఫ్రాడ్ కేసులో సుజనాపై లుకౌట్ నోటీసులు
  • అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన సుజనా
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
  • సోమవారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై గతంలో బ్యాంకు ఫ్రాడ్ కేసుకు సంబంధించి ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించగా, విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో, తనపై జారీ అయిన లుకౌట్ నోటీసులను సవాల్ చేస్తూ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

తనపై లుకౌట్ నోటీసులను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుజనా  కోరారు. ఈ నెల 15న న్యూయార్క్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్ లో రెండు వారాల పర్యటన ఉందని తన పిటిషన్ లో తెలిపారు. తన పిటిషన్ లో ఇమ్మిగ్రేషన్ బ్యూరో, ఈడీ, సీబీఐ, హోంశాఖలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. సుజనా దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది.


More Telugu News