అమెరికా ఆర్మీ క్షిపణి టెక్నాలజీని చైనాకు అందించాడన్న కేసు.. చైనీయుడికి 38 నెలల జైలు శిక్ష

  • చైనాకు చెందిన ఉయ్‌సన్‌ అనే వ్యక్తికి జైలు శిక్ష
  • అమెరికాలోని టక్‌సన్‌ సంస్థలో పని చేస్తోన్న ఉయ్‌సన్
  • సంస్థ ల్యాప్‌టాప్‌ను చైనాకు తీసుకెళ్లిన వైనం
  • చర్యను తీవ్రంగా పరిగణించిన అమెరికా కోర్టు
చైనాకు చెందిన ఉయ్‌సన్‌ అనే వ్యక్తి అమెరికాలోని టక్‌సన్‌ సంస్థలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరుగా పని చేస్తూ అమెరికా ఆర్మీకి చెందిన రహస్య క్షిపణి టెక్నాలజీని చైనాకు అక్రమంగా అందించాడన్న కేసులో అతడికి అగ్రరాజ్యంలోని న్యాయస్థానం 38 నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. టక్‌సన్‌ సంస్థలో అమెరికా‌ ఆర్మీ కోసం రేథియాన్‌ క్షిపణులతో పాటు కొన్ని రక్షణ పరికరాలను అభివృద్ధి చేస్తారు.

ఇందులో టక్‌సన్ పనిచేస్తోన్న నేపథ్యంలో అమెరికన్‌ డిఫెన్స్‌ టెక్నాలజీని నేరుగా యాక్సెస్‌ చేసే అవకాశం ఆయనకు ఉంటుంది. ఉయ్‌సన్‌ తన వ్యక్తిగత పని మీద గత ఏడాది జనవరికి ముందు చైనా వెళ్లాడు. టక్‌సన్‌ సంస్థ ఇచ్చిన ల్యాప్‌టాప్‌ను తనతో పాటు తీసుకెళ్లి అమెరికా టెక్నాలజీని చైనాకు చేరవేశాడని అమెరికాలో కేసు నమోదు కావడంతో విచారణ జరిగింది.
 
నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాడని కేసులో పేర్కొన్నారు. ఉయ్‌సన్ మాత్రం తాను రహస్య టెక్నాలజీని చైనాకు ఇవ్వలేదని, తాను పనిచేస్తోన్న సంస్థకు సంబంధించిన ల్యాప్‌టాప్‌ను దురుద్దేశంతో చైనాకు తీసుకెళ్లలేదని చెబుతున్నాడు. అయితే, ఆయన ‌చాలా నైపుణ్యం గల ఇంజినీరుని, అత్యంత సున్నితమైన ఈ టెక్నాలజీని చైనాకు బదలాయించడం నేరమని కూడా ఆయనకు తెలుసని అటార్నీ జనరల్‌ జాన్‌ సీ డిమెర్స్‌ చెప్పారు.

అన్ని విషయాలు తెలిసినప్పటికీ అమెరికన్‌ ఆర్మీ రహస్య టెక్నాలజీని చైనాకు ఇచ్చారని చెప్పారు. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం ఉయ్‌సన్ చర్యను తీవ్రంగా పరిగణించి, శిక్ష విధించింది. ఆయన చర్య పొరపాటున ల్యాప్‌టాప్‌ తీసుకెళ్లడానికి సంబంధించింది మాత్రమే కాదని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ సహాయ డైరెక్టర్‌ అలాన్‌ ఇ కోహ్లెర్ అన్నారు. అమెరికా‌ క్షిపణి సాంకేతికతను విదేశాలకు ఎగుమతి చేసే చర్యలకు పాల్పడ్డారని ‌అన్నారు.


More Telugu News