పెళ్లి చేసుకున్న కల్యాణ్ రామ్ 'కత్తి' హీరోయిన్... సినిమాల కోసం తన వద్దకు రావద్దని ప్రకటన!

  • ముఫ్తీ అనాస్ తో సనా ఖాన్ వివాహం
  • ఇకపై సినిమాలను మానేస్తున్నానని ప్రకటన
  • మానవత్వం కోసం పనిచేస్తానని వెల్లడి
కల్యాణ్ రామ్ కెరీర్ లో ఓ హిట్ చిత్రంగా నిలిచిన 'కత్తి' సినిమా హీరోయిన్ సనా ఖాన్ గుర్తుందా? తన అందం, నటనతో సినీ ప్రేక్షకులను మెప్పించిన సనా, ఆపై 'గగనం', 'మిస్టర్ నూకయ్య'ల్లోనూ కనిపించింది. హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. తాజాగా, గుజరాత్ కు చెందిన ముఫ్తీ అనాస్ అనే యువకుడిని పెళ్లి చేసుకుని సర్ ప్రయిజ్ ఇచ్చింది సనా ఖాన్.

పెళ్లి దుస్తుల్లో ఉన్న సనా ఖాన్, ముఫ్తీ చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా, కేవలం దగ్గరి కుటుంబీకుల మధ్య సనా వివాహం జరిగినట్టు సమాచారం. ఇక పెళ్లి తరువాత తాను పూర్తిగా సినిమాలను మానేస్తున్నానని, సినిమాల కోసం తనను సంప్రదించవద్దని ఆమె స్పష్టం చేసింది.

గత కొన్నేళ్లుగా సినిమాల్లో రాణిస్తూ, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నానని, ఈ విషయంలో తాను అదృష్టవంతురాలినని వ్యాఖ్యానించిన ఆమె, తనకు పేరు, సంపద, గౌరవాలను సినీ పరిశ్రమ అందించిందని పేర్కొంది. ఇకపై సినిమా లైఫ్ స్టయిల్ కు పూర్తి దూరం కావాలని భావిస్తున్నామని, మానవత్వం కోసం పనిచేస్తూ, సేవ చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపింది.



More Telugu News