విశాఖలో డ్రగ్స్ విక్రయం.. ఐదుగురి అరెస్ట్

  • డార్క్ వెబ్‌సైట్ ద్వారా బిట్‌కాయిన్ విధానంలో కొనుగోలు
  • ఒక్కో ఎల్ఎస్‌డీని రూ.400కు కొనుగోలు చేసి రూ. 1000 విక్రయం
  • ఒక్కరు మినహా మిగిలిన వారు అరెస్ట్
ఆన్‌లైన్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని తిరిగి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు వారి నుంచి లైసర్జిక్ యాసిడ్ డైఇథైలమైడ్ (ఎల్‌ఎస్‌డీ) బోల్ట్స్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పీఎం పాలెంలో నివసిస్తున్న అరవింద్ అగర్వాల్ (21) బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు స్నేహితుల ద్వారా ఎల్ఎస్‌డీ గురించి తెలుసుకున్నాడు.

నగరానికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా డార్క్‌వెబ్‌సైట్‌లో బిట్‌కాయిన్ విధానంలో ఒక్కో ఎల్ఎస్‌డీని రూ. 400 చొప్పున కొనుగోలు చేసి వీటిని తన చిన్ననాటి స్నేహితులైన కె.సాహిల్ (20), బిల్లా చంద్రశేఖర్ (28), మైఖేల్ వెల్‌కమ్ (22), ఎం.మురళీధర్ (20), వై.అశోక్ (22)లకు విక్రయించేవాడు. ఒక్కో పిల్‌కు 1000 రూపాయల చొప్పున వసూలు చేసేవాడు.

వారు వాటిని కాలేజీ విద్యార్థులకు రూ. 2 వేల చొప్పున అమ్మేవారు. సమాచారం అందుకున్న పోలీసులు వై. అశోక్ మినహా మిగతా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 ఎల్ఎస్‌డీ బోల్ట్స్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News