బండి సంజయ్ పై ఆరోపణలతో రాజాసింగ్ ఆడియో వైరల్.. ప్రత్యర్థుల కుట్ర అంటూ ఎమ్మెల్యే ఖండన!

  • తన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదంటూ ఆరోపణలు 
  • వైరల్ అవుతున్న రాజాసింగ్ గొంతుతో ఉన్న ఆడియో
  • అది తన గొంతుకాదంటూ ఎమ్మెల్యే వివరణ 
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనను మోసం చేశారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన అనుచరులకు గన్‌ఫౌండ్రీ, బేగంబజార్ టికెట్లు అడిగితే ఇవ్వలేదంటూ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వాపోయినట్టుగా ఉన్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. గోషామహల్ నియోజకవర్గాన్ని తనకు వదిలేయాలని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయిందని, గత ఎన్నికల్లో తన విజయం కోసం శ్రమించిన వ్యక్తికి టికెట్ ఇప్పించుకోలేకపోయానని ఆ ఆడియోలో ఉంది. తన వారికి టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని, త్వరలోనే ఈ విషయమై అధిష్ఠానానికి లేఖ రాస్తానని అందులో రాజాసింగ్ పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న ఆడియోపై రాజాసింగ్ స్పందించారు. ఆ ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కావాలనే ఈ దుష్ప్రచారానికి దిగారని అన్నారు. అంతేకాదని, బండి సంజయ్‌ తీరుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరగబోతోందని, ఆయనను తక్షణమే పార్టీ నుంచి తొలగించాలని తన పేరుతో ఓ ట్వీట్‌ను కూడా వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా దీనిని అభివర్ణించిన రాజాసింగ్.. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.


More Telugu News