తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నాం: తులసిరెడ్డి
- ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోదీ మాట తప్పారు
- హోదా గురించి వైసీపీ ఎంపీలు మాట్లాడటం లేదు
- పోలవరం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే
తిరుపతి లోక్ సభ ఎన్నికలో పోటీ చేస్తున్నామని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈరోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని... అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు వెనకడుగు వేస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ మళ్లీ పెరుగుతోందని... తిరుపతి ఎన్నికలో సత్తా చాటుతామని అన్నారు.