తెలంగాణను ఫిరాయింపులకు అడ్డాగా మార్చిన కేసీఆర్.. చివరకు ఆ ఫిరాయింపులకే బలవుతారు: రేవంత్ రెడ్డి

  • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడానికి కేటీఆర్ కారణం
  • తండ్రీ, కొడుకుల మధ్య హైదరాబాద్ నలిగిపోతోంది
  • కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయారు
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఇతర రాజకీయ పార్టీలు నిలవలేకపోయాయి. ఆయన విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ గాలానికి ఇతర పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యారు. కేసీఆర్ దెబ్బకు టీడీపీ, కాంగ్రెస్ లోని కీలక నేతలంతా టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు అదే ట్రెండ్ బీజేపీలో కనిపిస్తోంది. పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై ఓ మీడియా సంస్థతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణను ఫిరాయింపుల అడ్డాగా కేసీఆర్ మార్చారని రేవంత్ అన్నారు. ఇప్పుడు అవే ఫిరాయింపులకు కేసీఆర్ బలవుతారని చెప్పారు. అమ్ముడుపోయేవాడు అమ్ముడు పోతూనే ఉంటాడని చెప్పారు. కత్తిని నమ్ముకున్నోడు కత్తికే బలైనట్టు... కేసీఆర్ కూడా ఫిరాయింపులకే బలవుతారని అన్నారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడానికి మంత్రి కేటీఆర్ కారణమని రేవంత్ అన్నారు. ఆయనకు పాలనపైన, వ్యవస్థలపైన పట్టు లేదని చెప్పారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. తండ్రి కేసీఆర్ కు అహంభావమని, కొడుకు కేటీఆర్ కు పాలన చేతకాదని అన్నారు. ఇద్దరి మధ్య హైదరాబాద్ నలిగిపోతోందని చెప్పారు.

అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడమే దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణమని రేవంత్ అన్నారు. తమ కంటే మూడున్నర నెలల ముందే టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారాన్ని ప్రారంభించాయని చెప్పారు.


More Telugu News