బక్క కేసీఆర్ ను కొట్టేందుకు ఇంతమందా...?: బీజేపీ ప్రచారంపై సీఎం కేసీఆర్ ఫైర్

  • జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ నేతలు
  • ఓట్ల కోసం వరదలా వస్తున్నారన్న సీఎం కేసీఆర్
  • సొంత రాష్ట్రాల్లో చక్కదిద్దుకోలేనివాళ్లు అంటూ ఎద్దేవా
సీఎం కేసీఆర్ కూడా గ్రేటర్ ఎన్నికల ప్రచార బరిలో దూకారు. ఇవాళ హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీజేపీ గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం జాతీయ స్థాయి నాయకులను బరిలో దింపడంపై స్పందించారు.

వరద బాధితులను ఆదుకునేందుకు రానివారు ఇప్పుడు ఓట్ల కోసం వరదలా వస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా నాయకులు వస్తున్నారని, బక్క కేసీఆర్ ను కొట్టేందుకు ఇంతమందా..? అని వ్యాఖ్యానించారు. అయినా, వారి సొంత రాష్ట్రాల్లో ఉద్ధరించలేనివాళ్లు ఇక్కడకొచ్చి ఏంచేస్తారు? అంటూ ఎద్దేవా చేశారు.

వరద సాయం రూ.1300 కోట్లు అడిగితే ప్రధాని మోదీ 13 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలకు సాయం చేశారని, ఏం మనం భారతదేశంలో లేమా? అని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటేసే ముందు నేతల పనితీరు బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. రాబోయే కాలంలో హైదరాబాదులో 24 గంటల పాటు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. పేదలకు 20 వేల లీటర్ల ఉచిత నీరు అందిస్తామని, ఇది నగర ప్రజలకు తానిచ్చే శాశ్వత కానుక అని అన్నారు. మున్ముందు అపార్ట్ మెంట్ వాసులకు కూడా దీన్ని వర్తింపజేస్తామని కేసీఆర్ వెల్లడించారు.

రైతు బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని, కేసీఆర్ కిట్ పథకం దిగ్విజయం సాధించిందని వివరించారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నా గానీ సంక్షేమ పథకాల అమలు మాత్రం ఆపలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గాలివాటంగా ఓటేయకూడదని, తాము చేస్తున్న పనులను చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో మరిన్ని మంచి పనులు చేస్తానని ఉద్ఘాటించారు.


More Telugu News