బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉంది: విజయశాంతి

  • తనను కొట్టేందుకు ఇంతమంది రావాలా అన్న కేసీఆర్
  • కేసీఆర్ కు, కరోనా వైరస్ కు పోలిక పెట్టిన విజయశాంతి
  • దుష్టశక్తి అంతానికి మంచి శక్తులు కలిస్తే ఫలితం వస్తుందని వెల్లడి
ఇవాళ హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తనను కొట్టేందుకు ఇంతమంది రావాలా? అంటూ బీజేపీ జాతీయస్థాయి నాయకులను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఒక బక్కజీవి అయిన కేసీఆర్ ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని ప్రశ్నించారని, ఇంతకంటే విడ్డూరం ఏముంటుందని తెలిపారు.

"కేసీఆర్ మాటలు వింటుంటే.... ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కూడా కంటికి కనిపించని సూక్ష్మజీవినైన తనను నివారించడానికి ప్రపంచంలోని దేశాలన్నీ కలిసిపోరాడడం సమంజసమేనా అని అడిగినట్టుంది. తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుబట్టడం కూడా అదే విధంగా ఉంది. ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీ కలిసి ఎంతో పోరాటం చేస్తే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోంది.

జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే అభివృద్ధి ఆగిపోతుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగి మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ గారు అరిచి గీపెడుతున్నారు. కేసీఆర్ కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని పలు రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు మళ్లీ మళ్లీ ఎలా అధికారం దక్కుతోంది?" అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.


More Telugu News