'ఆషికీ' స్టార్ రాహుల్ రాయ్ కి బ్రెయిన్ స్ట్రోక్!

  • కార్గిల్ లో షూటింగ్ లో ఉండగా బ్రెయిన్ స్ట్రోక్
  • కార్గిల్ నుంచి ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలింపు
  • విపరీతమైన చలి వల్లే స్ట్రోక్ వచ్చిందన్న ఆయన సోదరుడు
1990లో విడుదలైన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'ఆషికీ'లో నటించిన రాహుల్ రాయ్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. 'ఎల్ఏసీ - లివ్ ది బ్యాటిల్ ఇన్ కార్గిల్' సినిమా షూటింగ్ లో ఉండగా ఆయన స్ట్రోక్ కు గురయ్యారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం 52 ఏళ్ల రాహుల్ రాయ్ ని హుటాహుటిన ముంబైకు తరలించి నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం కార్గిల్ లో విపరీతమైన చలి ఉంది. ఆ చలి వాతావరణం వల్లే రాహుల్ రాయ్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని ఆయన సోదరుడు రోమీర్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే రాహుల్ ను కార్గిల్ నుంచి శ్రీనగర్ కు అక్కడి నుంచి ముంబైకి తరలించారని చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.

మహేష్ భట్  తెరకెక్కించిన 'ఆషికీ' చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. ఆ చిత్రంతో రాహుల్ రాయ్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మహేశ్ భట్ తెరకెక్కించిన 'ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ', 'జునూన్', 'సప్నే సాజన్ కే', 'నసీబ్' వంటి చిత్రాలలో నటించారు. పలు టెలివిజన్ షోలను నిర్వహించారు. 2006లో హిందీ బిగ్ బాస్ సీజన్-1లో పాల్గొన్న రాహుల్ రాయ్ ఆ షోలో విజేతగా నిలిచారు. సినిమాలలో నటిస్తూనే చిత్ర నిర్మాణంలోకి కూడా రాయ్ అడుగుపెట్టారు. రాహుల్ రాయ్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్రాలను నిర్మించారు.


More Telugu News