ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను బెల్టుతో చితకబాదిన తిరుపతి ఎస్సై

  • గేదెల యజమానులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలు
  • స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన మహిళ
  • ఎస్సైపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై ఓ ఎస్సై ప్రతాపం చూపించాడు. బెల్టుతో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. షాక్‌కు గురైన బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగడంతో స్పందించిన సీఐ.. ఎస్సైపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ధర్నా విరమించింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిందీ ఘటన. బాధితురాలి కథనం ప్రకారం.. తిరుపతి రూరల్ మండలంలోని ఉప్పరపల్లికి చెందిన వనితా వాణి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తోంది. శనివారం ఆమె ఇంటి గార్డెన్‌లోకి గేదెలు వచ్చి ధ్వంసం చేయడంతో అవి బయటకు వెళ్లకుండా గేటు వేసింది. విషయం తెలిసిన వాటి యజమానులు వనితా వాణి ఇంటికి చేరుకుని ఆమెతో వాగ్విదానికి దిగి దాడిచేశారు.

దీంతో ఆమె 100 డయల్‌కు ఫోన్ చేసింది. పోలీసులు అక్కడికి రావడం చూసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారిపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో పూజ చేసేందుకు స్టేషన్ గదులను శుభ్రం చేశారు. ఆ విషయాన్ని గమనించకుండా ఆమె లోపలికి వెళ్లడంతో ఎస్సై ప్రకాశ్ కుమార్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెను దుర్భాషలాడాడు. దీంతో ఎందుకలా తిడుతున్నారని బాధితురాలు ప్రశ్నించింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన ఎస్సై బెల్టుతో ఆమెను చితకబాదాడు.

దీంతో హతాశురాలైన ఆమె ఎస్సైపై ఫిర్యాదు చేసేందుకు దిశ పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లింది. ఎస్పీ ఊరులో లేరని తెలియడంతో తిరిగి ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ధర్నాకు దిగింది. అక్కడే ఉన్న మహిళా పోలీసు ఆమెను లాగేస్తూ తనను తిట్టినట్టు బాధితురాలు ఆరోపించింది. విషయం తెలిసిన సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌ వద్ద బాధితురాలితో మాట్లాడారు. గేదెల యజమానులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. బెల్టుతో దాడిచేసిన ఎస్సైపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


More Telugu News