లాక్ డౌన్ లో ఉద్యోగం పోగొట్టుకుని, ఇప్పుడు నెలకు రూ. 40 వేలు సంపాదిస్తున్న యువకుడు!

  • లాక్ డౌన్ కు ముందు నెలకు రూ.12 వేలు
  • ఉద్యోగం పోవడంతో టీ అమ్ముతూ ఉపాధి
  • ఈ వ్యాపారమే బాగుందంటున్న మహేంద్ర వర్మ
రోజుకు 10 గంటల పాటు పనిచేస్తే, నెల రోజుల తరువాత వచ్చేది రూ. 12 వేలు. అది కూడా కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా పోయింది. రెండు నెలలు ఇంట్లో కూర్చోవడంతో చేతిలోని డబ్బులు అయిపోయి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇది న్యూఢిల్లీలో ఉన్న మహేంద్ర వర్మ అనే యువకుడి దీనగాథ. కేవలం మహేంద్ర వర్మదే కాదు... దేశవ్యాప్తంగా లక్షలాది మందిది ఇదే పరిస్థితి. అయితే, అందరి మాదిరిగా అతను ఊరికే కూర్చోలేదు. ఓ సైకిల్ తీసుకుని, దాని వెనుక టీ, కాఫీ ప్లాస్కులు పెట్టుకుని, వ్యాపారం ప్రారంభించాడు.

ఢిల్లీలోని టికరీ బార్డర్డ్ ప్రాంతంలో సైకిల్ పై తిరుగుతూ అమ్మకాలు సాగించడం ప్రారంభించిన తరువాత, అతని టీ, కాఫీ రుచి నచ్చి, కస్టమర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు తాను నెలకు రూ. 40 వేలు సంపాదిస్తున్నానని ఎంతో ఆనందంగా మహేంద్ర చెబుతున్నాడు. తాను టీని రూ. 5కు, కాఫీని రూ. 10కి అమ్ముతున్నానని, చలికాలం కావడంతో విక్రయాలు మరింతగా పెరిగాయని చెప్పాడు. ఇకపై మళ్లీ ఉద్యోగానికి వెళ్లే ఆలోచన లేదని, టీ వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో, దీనినే కొనసాగిస్తానని చెప్పుకొచ్చాడు.


More Telugu News