జగన్ కు హిందూ సంప్రదాయాలపై నమ్మకం, గౌరవం లేవు: సోము వీర్రాజు ఫైర్

  • చర్చిలకు, దర్గాలకు కోట్లు కేటాయించారు
  • ప్రజా ధనాన్ని చర్చిలకు ఎలా ఇస్తారు?
  • దేవాదాయ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు హిందూ సంప్రదాయాలపై గౌరవం, నమ్మకం లేవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. చర్చిలకు రూ. 24 కోట్లు, దర్గాలకు రూ. 5 కోట్లు కేటాయించారని... ప్రజా ధనాన్ని చర్చిల నిర్మాణానికి ఎలా ఇస్తారని మండిపడ్డారు.

దేవాదాయశాఖ తీరు ఆందోళనకరంగా ఉందని... రాష్ట్రంలో అనేక ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసే పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు హయాంలో అనేక ఆలయాలను పడగొట్టారని... అప్పుడు బీజేపీలో ఉన్న ప్రస్తుత దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పడగొట్టిన ఆలయాలను మళ్లీ కట్టాలని డిమాండ్ చేశారని... ఇప్పుడు మాత్రం దర్గాలను కడతామని ఆయన చెపుతున్నారని విమర్శించారు.

దేవాలయాల భూములను ఇళ్ల స్థలాలకు, ఆలయాల నిధులను ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. దేవాలయాలను నిర్వీర్యం చేస్తున్న మంత్రి వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న చర్చిలకు వేల కోట్ల ఆదాయాలున్నాయని... జగన్ కు దమ్ముంటే వాటి నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు చేయాలని సవాల్ విసిరారు. జగన్ కు చర్చిలు, దర్గాలు మాత్రమే కావాలా? ఆలయాలు అవసరం లేదా? అని ప్రశ్నించారు. రేపు అమరావతిలో జరిగే బహిరంగసభకు బీజేపీ మద్దతు ప్రకటిస్తోందని... ఆ కార్యక్రమంలో బీజేపీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు.


More Telugu News