పోతిరెడ్డిపాడు తాజా పరిస్థితిపై అఫిడవిట్ దాఖలు చేయండి: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు

  • పోతిరెడ్డిపాడు పనులపై ఎన్జీటీలో పిటిషన్
  • నేడు విచారణ చేపట్టిన ట్రైబ్యునల్
  • భూసార పరీక్షలు జరుగుతున్నాయన్న ఏపీ
  • పనులు వేగంగా జరుగుతున్నాయంటూ పిటిషనర్ ఆరోపణ
  • ఫొటోలు, వీడియో ఆధారాలు కోర్టుకు సమర్పణ
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నేపథ్యంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఎన్జీటీలో నేడు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్ వెంకటరమణి వాదనలు వినిపించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు వద్ద జరుగుతున్నది నిర్మాణ పనులు కాదని స్పష్టం చేశారు. భూసార పరీక్షలు, జియోలాజికల్ పరీక్షలు చేపడుతున్నారని, డీపీఆర్ తయారీ కోసం సాధారణ పనులను మాత్రమే నిర్వహిస్తున్నారని వివరించారు.

అందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది బదులిస్తూ... పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం చెబుతున్న అంశాలు అవాస్తవాలని, అక్కడ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని విన్నవించారు. దీనికి సంబంధించిన ఆధారాలుగా పలు వీడియోలు, ఫొటోలను ఎన్జీటీకి సమర్పించారు. వాదనలు పూర్తయిన పిమ్మట... పోతిరెడ్డిపాడులో ఇప్పుడు ఏంజరుగుతుందో ఆ పరిస్థితులపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. అఫిడవిట్ తమకు సంతృప్తికరంగా లేకపోతే పరిశీలన కమిటీని ప్రాజెక్టు వద్దకు పంపుతామని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.


More Telugu News