అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు.. పట్టణంలో ఉద్రిక్తత.. 144 సెక్షన్ విధింపు

  • వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం 
  • ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాళ్లు
  • గుడిలో ప్రమాణానికి సిద్ధమైన నాయకులు 
  • అప్రమత్తమైన పోలీసులు .. భారీగా మోహరింపు 
తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడంతో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు.

ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకున్నారు. మైనింగ్‌లో అవినీతి జరగలేదని చెప్పిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి బిక్కవోలులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని అన్నారు. దీంతో  రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. ఈ సవాల్‌ను తాను స్వీకరించానని అన్నారు. ప్రమాణాలకు ముందు తాను చేసిన ఆరోపణలపై చర్చ జరగాలని సవాలు విసిరారు. ఆ అనంతరం ప్రమాణం చేద్దామని చెప్పారు.

మరోపక్క, వారు గుడికి వెళ్లి ప్రమాణాలు చేసుకోవడానికి స్థానిక పోలీసుల నుంచి అనుమతి కూడా వచ్చింది. వారిద్దరి తరఫున ఐదుగురు నాయకుల చొప్పున మాత్రమే వెళ్లాలని కండిషన్ పెట్టారు. అయితే, శాంతియుత వాతావరణంలో ప్రమాణం జరగదన్న అంచనాకు పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో అనపర్తి నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించి, భారీగా పోలీసులు మోహరించారు. అయితే, బహిరంగ చర్చకు కూడా రావాలంటూ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తుండడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు వైసీపీ నేతలను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు.


More Telugu News