అరుణ్ జైట్లీ విగ్రహం పెట్టాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. క్రికెట్ అసోసియేషన్ సభ్యత్వాన్ని వదులుకున్న బేడీ!

  • ఢిల్లీలోని కోట్లా మైదానంలో జైట్లీ విగ్రహం పెట్టాలని నిర్ణయం
  • క్రికెటర్ల కంటే అడ్మినిస్ట్రేటర్లకే ప్రాధాన్యతను ఇస్తున్నారన్న బేడీ
  • జైట్లీ విగ్రహాన్ని అంగీకరించలేనన్న క్రికెట్ దిగ్గజం
ఢిల్లీలోని ఫిరోజ్ కోట్లా మైదానంలో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై భారత స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలోని ఒక స్టాండ్ కు పెట్టిన తన పేరును తొలగించాలని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)ను కోరారు. అంతేకాదు డీడీసీఏ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆయన డీడీసీఏకు లేఖ రాశారు. క్రికెట్ వ్యవస్థలోకి బంధుప్రీతి వస్తోందని తన లేఖలో మండిపడ్డారు. క్రికెటర్లకు కాకుండా అడ్మిస్ట్రేటర్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారని దుయ్యబట్టారు.

ఎంతో సహనం, క్షమాగుణం కలిగిన వ్యక్తినని తాను ఎంతో గర్వపడుతుంటానని... కానీ ఆ సహనం నశించే రోజులు వచ్చాయనే భయం ఇప్పుడు కలుగుతోందని అన్నారు. డీడీసీఏ తన సహనాన్ని పరీక్షించిందని, తాను ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పారు. అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా అవినీతి చోటు చేసుకుందని... అలాంటి వ్యక్తి విగ్రహాన్ని స్టేడియంలో పెట్టేందుకు తాను అంగీకరించలేనని అన్నారు.

అరుణ్ జైట్లీ దాదాపు 14 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆయన గౌరవార్థం స్టేడియంలో ఆరు అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాలని డీడీసీఏ నిర్ణయించింది. 2017లో స్టేడియంలోని ఒక స్టాండ్ కు ఆయన పేరు పెట్టారు. ఆయన కుమారుడు రోహన్ జైట్లీ ప్రస్తుతం డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు.


More Telugu News