మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఆక్రమణల తొలగింపు

  • ఆక్రమణలను కూల్చేందుకు వెళ్లిన రెవెన్యూ, పోలీసు సిబ్బంది
  • కారం చల్లి దాడికి యత్నించిన ఆక్రమణదారులు
  • మంటలంటుకుని సీఐకి గాయాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణదారులు పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై ఆక్రమణదారులు దాడులకు  యత్నించారు. ఈ క్రమంలో సీఐ భిక్షపతిరావుకు మంటలు అంటుకోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లో ప్రజావసరాల కోసం అవసరమైన ప్రభుత్వ భూమిని గుర్తించారు. బాలాజీనగర్‌లో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణానికి కొన్ని గజాల స్థలాన్ని కేటాయించారు. సెప్టెంబరులో అధికారులు శంకుస్థాపన కూడా చేశారు. అయితే, ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ఆ భూమిపై కన్నేసిన కొందరు కబ్జా చేసి దానిని పూనమ్ చంద్ అనే వ్యక్తికి అమ్మేశారు. మూడు వారాల క్రితం అతడు అక్కడ ఓ గదిని కట్టుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లారు.

గమనించిన ఆక్రమణదారులు అధికారులపై కారం చల్లారు. అంతేకాకుండా తమ నిర్మాణాలను కూల్చివేస్తే ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆ భూమిని కొనుగోలు చేసిన పూనంచంద్ కుటుంబ సభ్యులు పెట్రోలు డబ్బా పట్టుకుని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే గది నుంచి పొగలు వస్తుండడంతో వారిని రక్షించేందుకు పోలీసులు ముుందుకెళ్లారు. తలుపులు తెరవాలని అభ్యర్థించారు. వారు వినిపించుకోకపోవడంతో తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో లోపలున్న వ్యక్తులు అక్కడున్న వారిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.

ఈ క్రమంలో సీఐ భిక్షపతి రావుకు మంటలు అంటుకోవడంతో ఆయన కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు 50 శాతం గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. ఉన్నతాధికారులు ఆసుపత్రిలో ఆయనను కలిసి పరామర్శించారు. పూనంచంద్, శాంతిదేవిలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News