కరోనా కష్ట కాలంలోనూ జీహెచ్​ఎంసీకి భారీ రాబడి!

  • సమకూరిన రూ.2,256.17 కోట్లు
  • ఆస్తి పన్ను ద్వారానే రూ.1,202.35 కోట్లు
  • వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.2,286 కోట్ల ఖర్చు
దాదాపు అన్ని వ్యాపారాలనూ కరోనా దెబ్బకొట్టింది. చాలా మంది కడుపు కొట్టింది. జీవితాలను కుదేలు చేసింది. అలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) భారీగానే డబ్బులు వెనకేసింది. ఆ వచ్చిన డబ్బులనూ అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టింది. ఈ ఏడాది వచ్చిన ఆదాయవ్యయాలకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రకటనను విడుదల చేసింది.

జీహెచ్ఎంసీకి ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.2,256.7 కోట్ల ఆదాయం వచ్చినట్టు జీహెచ్ఎంసీ పేర్కొంది. అందులో రూ.2,286.3 కోట్లను వివిధ అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్టు చెప్పింది. వచ్చిన ఆదాయంలో రూ.1,202.35 కోట్లు ఆస్తి పన్ను రూపంలోనే సమకూరిందని వివరించింది. అందులో నుంచి రూ.900 కోట్లు అభివృద్ధి పనుల కోసం వెచ్చించినట్టు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆస్తి పన్నులు రూ.140 కోట్ల మేర అధికంగా వచ్చాయి.

  రూ.1,102.71 కోట్ల పనుల బిల్లుల్లో రూ.909.17 కోట్లు క్లియర్ చేసినట్టు జీహెచ్ఎంసీ పేర్కొంది. సిమెంట్ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం వంటి పనులను చేపట్టినట్టు వివరించింది. పట్టణ ప్రణాళిక విభాగానికి రూ.396.18 కోట్ల రాబడి వచ్చిందని, ఆరోగ్యం, పారిశుద్ధ్యం పనుల కోసం రూ.403.13 కోట్లు ఖర్చు చేశామని తెలిపింది. వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.89.52 కోట్లను వెచ్చించామని పేర్కొంది.  

జీహెచ్ఎంసీ సిబ్బంది, కార్మికులకు రూ.854.88 కోట్లను జీతాల రూపంలో చెల్లించామంది. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి నవంబర్ కాలానికి రూ.564.92 కోట్ల నిధులను విడుదల చేసిందని, 2020 డిసెంబర్ నుంచి 2021 మార్చి కాలానికిగానూ నెలకు రూ.78 కోట్ల చొప్పున మొత్తం రూ.312 కోట్లను విడుదల చేస్తుందని వెల్లడించింది.

ఎస్ఆర్డీపీ కింద రూ.5,934 కోట్ల విలువైన పనులను జీహెచ్ఎంసీ చేస్తోంది. అందులో రూ.2,437 కోట్లు జీహెచ్ఎంసీనే ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 5 లింక్ రోడ్లను ప్రారంభించినట్టు జీహెచ్ఎంసీ చెప్పింది. 27 ప్రాంతాల్లో వాటి పనులు నడుస్తున్నాయి. 26 ప్రధాన రహదారులను వెడల్పు చేశామని, నాలుగు అండర్ పాస్లు, మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్/రైల్వే అండర్ బ్రిడ్జిలు సహా తొమ్మిది ఫ్లై ఓవర్లు, ఒక కేబుల్ బ్రిడ్జిని నిర్మించామని వెల్లడించింది. వాటన్నింటికీ రూ.1,010 కోట్ల వ్యయం అయిందని పేర్కొంది.


More Telugu News