ఇకపై ప్రవాసీలకూ పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యం!

  • ఉంటున్న దేశం నుంచే ఓటేసే అవకాశం
  • ఎన్నికల సంఘానికి విదేశాంగ శాఖ లేఖ
  • త్వరలో భాగస్వాములందరితోనూ ఈసీ చర్చలు
  • రాబోయే ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం
  • లబ్ధి పొందనున్న లక్షా 17 వేల మంది ఎన్నారైలు
ఎక్కడో దేశం కాని దేశంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడిపోయారు ప్రవాస భారతీయులు. కొన్ని లక్షల మంది విదేశాల్లో స్థిరపడ్డారు. మరి, మన దేశంలో ఎన్నికలైతే వచ్చి ఓటేసేందుకు ప్రవాసీలకు పెద్ద ప్రయాసే. ఓటేయాలని ఉన్నా రాలేరు.. ఓటు వేయలేరు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యమూ వాళ్లకు అందుబాటులో లేదు. ఇక, ఈ సమస్య రాదు.

ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) రంగంలోకి దిగింది. ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) ద్వారా వారికి ఓటు హక్కు కల్పించాల్సిందిగా ఈసీకి భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. భాగస్వాములందరితోనూ చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

దీనిపై త్వరలోనే ప్రవాస భారతీయుల సంఘాలు, పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల అధికారులతో చర్చలు జరుపనున్నామని ఈసీ వర్గాలు తెలిపాయి. సాయుధ బలగాలు, పారా మిలటరీ దళాలు, ఎన్నికల డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, విదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అంబాసిడర్లకు ఈటీపీబీఎస్ సౌకర్యాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పుడు ప్రవాసీయులకూ ఈ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది.

ప్రవాస భారతీయులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు 1961 కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ లో వీలైనంత తొందరగా కొన్ని సవరణలు చేయాలని న్యాయ శాఖ కార్యదర్శికి నవంబర్ 27న ఈసీ లేఖ రాసింది. సవరణలు చేస్తే ఏప్రిల్–మే నెలలలో నిర్వహించనున్న అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో ప్రవాసీయులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ప్రస్తుతం ఈసీ ఓటర్ జాబితాలో దాదాపు లక్షా 17 వేల మంది దాకా ప్రవాస ఓటర్లున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రవాసీలు ఆన్ లైన్ లో ఫారం 12ను పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఆ రిటర్నింగ్ అధికారి అన్నీ పరిశీలించి మెయిల్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ను పంపిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఐదు రోజుల తర్వాత నుంచి పోస్టల్ బ్యాలెట్ ను పంపించాల్సి ఉంటుంది.

ప్రవాస భారతీయులు నివాసముండే దేశంలోని మన దేశ దౌత్య లేదా కాన్సులర్ ప్రతినిధులు నియమించిన అధికారి ఆ పోస్టల్ బ్యాలెట్ ను అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక సదరు ప్రవాస భారతీయుల నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు జరిగే రోజు 8 గంటల లోపు ఆ పోస్టల్ బ్యాలెట్ చేరేలా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.


More Telugu News