ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు: జీవన్ రెడ్డి మండిపాటు

  • ఢిల్లీకి వెళ్లి మోదీ కాళ్లు పట్టుకున్నారు
  • వ్యవసాయ చట్టాలపై యూటర్న్ తీసుకున్నారు
  •  రైతుబంధు పథకం పచ్చి మోసం 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మోదీకి మొగుడిని అవుతానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్... అక్కడ మోదీ కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు పథకం పచ్చి మోసమని జీవన్ రెడ్డి అన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మంత్రులను కేసీఆర్ రోడ్లపై కూర్చోబెట్టారని... ఢిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

కనీస మద్దతు ధరను ప్రకటిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే... టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు. సోనియా ఏ దేశంలో పుడితే ఏంటని... రైతుల బాధలు ఏమిటో ఆమెకు తెలుసని అన్నారు.


More Telugu News