ట్రంప్ కు సొంత పార్టీ నేతల నుంచి సెగ.. విమర్శల ఏడాది!

  • క్యాపిటల్‌ హిల్‌పై దాడికి ట్రంప్ దే బాధ్యతంటూ అభియోగం
  • డెమోక్రాట్ల ప్ర‌య‌త్నాల‌కు మద్దతుగా ఓటేయనున్న ప‌లువురు రిప‌బ్లిక‌న్లు
  • ట్రంప్ తీరుపై సొంత పార్టీ నేత‌ల విమర్శ‌లు
  • అభిశంస‌న‌ను వ్య‌తిరేకిస్తోన్న మ‌రికొంద‌రు నేత‌లు
క్యాపిటల్‌ హిల్‌పై దాడికి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దే బాధ్యతని అభియోగం మోపుతూ ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. నేడు సభలో అభిశంసనపై ఓటింగ్‌ జరగనుంది. ఈ నేప‌థ్యంలో ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ ‌పార్టీలో ఈ వ్య‌వ‌హారం చీలికలకు దారి తీస్తోంది.

గ‌డువుకు ముందే ట్రంప్ ను తొలగించేందుకు ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల ప్ర‌య‌త్నాల‌కు మద్దతుగా ఓటేయనున్నట్లు రిప‌బ్లిక‌న్లు కొంద‌రు ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ కీల‌క నేత లిజ్‌ చెనీ ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికారు. త‌మ దేశ చ‌రిత్ర‌లో అధ్యక్ష హోదాను ట్రంప్‌ దుర్వినియోగపరిచినంతగా వేరెవ్వ‌రూ దుర్వినియోగ‌ప‌ర్చ‌లేద‌ని ఆమె అన్నారు.

ఆయ‌న వ‌ల్లే  క్యాపిటల్‌ భవనంపై దాడి జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ దాడి జరిగిన సమయంలో ఆయ‌న‌ జోక్యం చేసుకుని, దాన్ని ఆపాల్సింద‌ని ఆమె చెప్పారు. ట్రంప్ అభిశంస‌న‌కు రిప‌బ్లిక‌న్ నేత‌లు ఆడమ్‌ కిన్‌జింగర్‌, జాన్‌ కట్కో కూడా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

సొంత పార్టీ నేత‌లే త‌నకు వ్య‌తిరేకంగా ఓటు వేయ‌నున్న నేప‌థ్యంలో ట్రంప్ కు చిక్కులు త‌ప్పేలా లేవు. ఈ నేప‌థ్యంలో రిప‌బ్లికన్ పార్టీలోని మ‌రో వ‌ర్గం మాత్రం ట్రంప్‌ అభిశంసనను వ్య‌తిరేకిస్తూ కొన్ని రోజుల్లో ప‌ద‌వి నుంచి దిగిపోనున్న ట్రంప్ పై అభిశంస‌న తీర్మానం పెట్ట‌డం రాజకీయ కుట్రేనని అంటోంది. ఈ చ‌ర్య వ‌ల్ల త‌మ దేశంలో అధికార బదిలీకి ఆటంకాలు కలుగుతాయ‌ని చెప్పింది.


More Telugu News